పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని గ్రామాల్లో వడగళ్ల వాన పడింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో చెట్టుపై పిడుగు పడడంతో ఆవుల భూమయ్యకు చెందిన 33 గొర్రెలు మృతి చెందాయి. బాధితుడిని ఆదుకుంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. ఖిలావనపర్తిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని 3 చెట్లు పడి పోవడంతో ప్రహరీ కూలింది. పలు ప్రదేశాల్లో ఆరు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మంథని మండలం ఖానాపూర్‌లో వర్షానికి ధాన్యం తడిసింది. జూలపల్లి మండలంలో ఉరుములు, మెరుపులు, పెను గాలులతో భారీ వర్షం కురిసింది.
