నిజామాబాద్, సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ , ప్రైవేట్ అన్ని విద్యా సంస్థలలో పనిచేసే టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందితోపాటు ఆ సంస్థలలో ఇతర పనులు చేసే ప్రతి ఒక్కరికి, అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి విద్యార్థికి కూడా నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ చేయించాలని ఈ కార్యక్రమం వచ్చే బుధవారం కల్లా పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య, విద్యాసంస్థల అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుండి సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ కలెక్టర్లతో మాట్లాడుతూ పాఠశాలల్లో, అదేవిధంగా కళాశాలల్లో పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా విద్యార్థుల్లో మరింత నమ్మకం పెరిగి వారు పాఠశాలలకు పూర్తిస్థాయిలో హాజరు కావడానికి అవకాశం ఉన్నందున తద్వారా విద్యార్థులు తరగతులపై కరోనా భయం లేకుండా దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుందని నష్టపోయిన విజ్ఞానాన్ని అందించడానికి కొంతవరకైనా వీలు ఏర్పడుతుందని తెలిపారు.
విద్యాసంస్థల్లో పని చేసేవారికి, 18 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేయించడానికి చర్యలు తీసుకోవాలని పాఠశాలల్లో డ్రిరకింగ్ వాటర్, టాయిలెట్స్, విద్యుత్తు, పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కాగా జరిగే విధంగా, అందుకు సంబంధిత స్థానిక సంస్థల నుండి నిధులు ఖర్చు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కలెక్టర్లకు సూచించారు.
అనంతరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి మున్సిపల్, జిల్లా పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ తదితర శాఖల అధికారులతో సెల్ కాన్ఫరెన్సు నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.
విద్యాసంస్థల్లో ఎక్కడైనా విద్యుత్ బిల్లులు పెండిరగ్‌లో ఉంటే ఆ వివరాలు అందిస్తే ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని, కానీ ఏ విద్యా సంస్థలో కూడా బిల్లులు పెండిరగ్‌లో ఉన్నాయని కరెంటు డిస్కనెక్ట్ చేయవద్దని విద్యుత్ శాఖ ఎస్‌ఇ సుదర్శన్‌ను ఆదేశించారు. మండల విద్యాశాఖ అధికారులు ఈ విషయంలో సమస్యలుంటే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలని ప్రతి పాఠశాలలో కూడా విద్యుత్తు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రూరల్ వాటర్ సప్లయి ఎస్.ఈ. అన్ని విద్యా సంస్థలకు నీటి కనెక్షన్ ఉండేవిధంగా చూడాలని ఆదేశించారు. టాయిలెట్ల నిర్వహణ సంబంధిత గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలదే అన్నారు.
అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రధానోపాధ్యాయులు ధర్మామీటర్ ఖరీదు చేయాలని అన్ని విద్యా సంస్థలలో అందరు విద్యార్థులకు ప్రార్థనకు ముందు డిజిటల్ థర్మా మీటర్‌తో టెంపరేచర్ చెక్ చేయాలని ఎవరికైనా అధిక టెంపరేచర్ ఉంటే రాపిడ్ టెస్ట్ ఉంటే వెంటనే వైద్యాధికారిని సంప్రదించి ఆందోళన చెందకుండా తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు అవసరమైన రాపిడి టెస్ట్ కిట్స్ అందుబాటులో ఉంచాలని అని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే 95 శాతం టీచింగ్ నాన్-టీచింగ్ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు డిఈఓ తెలిపారని వీరితో పాటు పాఠశాలల్లో పనిచేసే ఇంకా ఎవరు కూడా మిగిలి ఉన్న వారందరికీ కూడా నూటికి నూరు శాతం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల, డిఐఈఓ, తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ నర్సింగ్ బీఈడీ తదితర అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్ తదుపరి చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయించడానికి వెంటనే ప్రణాళిక సిద్ధం చేసుకొని శనివారం నుండి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఒక సంస్థలో వంద మంది ఉంటే అక్కడికి ఆర్‌బిఎస్‌కె వ్యాక్సినేషన్ టీంను పంపించాలని డిఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించారు.
అన్ని విద్యాసంస్థల్లో ప్రతి చోట ప్రతి విషయంలో కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించే విధంగా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాల్స్‌కు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
సెల్ కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, డిఈఓ దుర్గాప్రసాద్, డిఎం హెచ్‌వో బాల నరేంద్ర, డాక్టర్ తుకారాం, డాక్టర్ ప్రమిద, డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.