కామారెడ్డి, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రోడ్ల గుంతలు పూడ్చాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లా రోడ్డులో పెట్రోల్ పంపు ముందు గల గుంతలో కూర్చొని గంట పాటు జల దీక్ష చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు విపుల్ జైన్ మాట్లాడుతూ పేరుకు జిల్లా కేంద్రం తప్ప కామారెడ్డిలో గత 7 సంవత్సరాలుగా అభివృద్ధి శూన్యం అని, ముఖ్యంగా సిరిసిల్లా రోడ్డు స్విమ్మింగ్ ఫుల్‌ను తలపిస్తూ గుంతలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో అధికారులు రోడ్లను బాగు చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
బీజేపీ కౌన్సిలర్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సూతారి రవి మాట్లాడుతూ గతంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి సిరిసిల్లా రోడ్డు కోసం 4 కోట్ల రూపాయలు మంజూరైనట్టు చెప్పినప్పటికీ ఇంత వరకు పని ఎందుకు ప్రారంభం కాలేదని, రావాల్సిన కమీషన్ల విషయంలో ఏమైనా పొరపొచ్చాలు వచ్చి రోడ్డు పనులు ఆపివేశారేమో అని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే పరిసర వ్యాపారస్తులను, ప్రయాణికులను కలుపుకొని ఉద్యమం ఉదృతం చేస్తామని అన్నారు.