ఆర్మూర్, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ, రాష్ట్ర శాఖ పిలుపుమేరకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినమైన సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 7 వరకు సేవా సమర్పణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా తీసుకుంటున్న కేంద్రాన్ని పరిశీలించి వారికి పండ్లు, పండ్ల రసాలు, బిస్కెట్లు అందజేశారు.
అనంతరం భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు లోక భూపతి రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర విజయవంతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని అదేవిధంగా రాబోయే కాలంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికై కృషి చేయాలన్నారు.
జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న వినయ్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఆశీస్సులు అందించి తన జన్మదినం సందర్భంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న వివిధ మండలాల, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.