కామారెడ్డి, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలం శివాయిపల్లిలో బృహత్ పల్లె ప్రకృతి వనంను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. రైల్వే వంతెన కింద వరద నీరు నిలిచి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. వైకుంఠ రథం, బాడీ ఫ్రీజర్‌ను పరిశీలించారు. రాజంపేటలో ఊర చెరువు కట్ట కుంగిపోయింది. భారీ వర్షాల కారణంగా చెరువు కట్ట కుంగిపోయిందని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
ఉపాధి హామీ పథకం ద్వారా తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. బసవన్నపల్లిలో అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను పరిశీలించారు. చిన్న మల్లారెడ్డి, రాజంపేట గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగును సందర్శించారు. వరద ఉధృతి ఎక్కువైతే రాకపోకలు నిలిచిపోయే ప్రమాదముందని గ్రామస్తులు తెలిపారు. కామారెడ్డి మండలం లింగాయపల్లిలో నర్సరీని, పల్లె ప్రకృతి వనంను సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో మరిన్ని మొక్కలు పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.