నిజామాబాద్, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గులాబ్ తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసినప్పటికీ కొంతమేర పంట నష్టం మినహా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
సోమవారం నుండి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి ఆకస్మికంగా హైదరాబాద్ నుండి మంగళవారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అధికారులు, ప్రాజెక్టు అధికారులు, ఆర్డీవోతో సమీక్షించారు. గులాబ్ తుఫాన్ వల్ల జిల్లాలో విపరీతంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, అక్కడక్కడ రోడ్లు కొంతమేర దెబ్బతిన్నాయని కొన్నిచోట్ల పంట పొలాల్లో నీరు చేరడం వల్ల పంటలకు కొంత మేర నష్టం జరిగిందని అధికారులతో వాటిని అంచనా వేయించి ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు.
దేవుని దయవల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పరిస్థితి పూర్తిగా యంత్రాంగం అదుపులో ఉన్నదని అధికారులందరూ వారి వారి స్థాయిలో అప్రమత్తంగా ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నందున ప్రజలు తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్ళవద్దని మంత్రి పేర్కొన్నారు.
ప్రాజెక్టులు చెరువులు కెనాల్స్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ కూడా మనుషులకు మూగజీవాలకు ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గ్రామస్థాయి అధికారులతో పాటు మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు సహాయ ఇంజనీర్లు వారి స్థానాల్లోనే ఉండి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయించాలని ఆదేశించారు.
ప్రజలు కూడా ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. మంత్రి వెంట ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ చక్రపాణి, ఆర్మూర్ ఆర్డిఓ శ్రీనివాస్, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.