నిజామాబాద్, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయిందని ఈ సీజన్‌లోనే కాకుండా గత మూడు సంవత్సరాలుగా కూడా ఇంత పెద్ద వర్షం జిల్లాలో కురువ లేదని అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా ప్రజలకు గాని మూగజీవాలకు గాని హానికాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని రహదారులు చెరువులు ఎక్కడైనా దెబ్బతింటే లేదా తెగిపోయిన వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు.
మంగళవారం క్యాంప్ కార్యాలయం నుండి రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బి, అగ్నిమాపక విద్యుత్తు, ఎంపీడీవోలు తదితర అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో సంబంధిత అధికారులతో పాటు మున్సిపాలిటీలలో వార్డుల వారీగా పర్యవేక్షణ చేయాలని మున్సిపల్ కమిషనర్‌లు కూడా స్వయంగా పర్యటించి సమస్యలు ఉన్నచోట ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎక్కడ కూడా నీరు నిలువకుండా మోరీలలో నీరు ఆగిపోకుండా బయటకు వెళ్లే విధంగా శుభ్రం చేయించాలని పేర్కొన్నారు. కార్పొరేటర్లు కౌన్సిలర్లు సర్పంచ్‌లతో అధికారులు మాట్లాడి సమస్యల గురించి తెలుసుకోవాలని తద్వారా మంచి సమాచారం తెలుస్తుందని ఆ విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట ట్రాక్టర్లు జెసిబిలను ఉపయోగించుకోవాలని తెలిపారు.
ఎంపీడీవోలు, తహసిల్దార్‌లు మండలాలకు వెళ్లి ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఎక్కడైనా ప్రమాదాలు కానీ రోడ్లు చెరువులు దెబ్బతిన్న విషయాలను కానీ తెలుసుకొని పునరుద్ధరించాలని రోడ్లు దెబ్బతిని వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుంటే ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయించాలని అంతేగాని ఆ నీళ్ళలో నుండి ఏ విధంగానూ ఎవరిని అనుమతించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కూలిపోయే అవకాశం ఉన్న ఇండ్లలో ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల ప్రాణాలకు, మూగజీవాలకు నష్టం రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బి, మండల స్థాయి అధికారులు మండలాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షించుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బ్రిడ్జిలు, చెక్ డ్యాములు, ప్రాజెక్టుల లోతట్టు ప్రాంతాలలో ప్రమాదాల అవకాశాలు ఉంటే ఆ ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. పంటలను కాపాడుకోవడానికి అవకాశం ఉన్న చోట రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశించారు. నిజాంసాగర్, పోచంపాడు తదితర ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో బాగా వస్తున్నందున బ్యాలెన్సింగ్ చేసుకుంటూ కిందికి నీటిని వదలాలని ఆదేశించారు. సెల్ కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.