నిజామాబాద్, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత స్వాతంత్రోద్యమ యువ కెరటం కామ్రేడ్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా కోటగల్లీలో గల భగత్ సింగ్ విగ్రహానికి పి.డి.ఎస్.యు, పీవోడబ్ల్యూ, పీవైఎల్, ఐ.ఎఫ్.టీ.యు సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోదావరి, సంధ్యారాణి మాట్లాడుతూ కామ్రేడ్ భగత్ సింగ్ దోపిడీ పీడనలు లేని సమాజం కోసం, భారత సంపూర్ణ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడయ్యాడన్నారు.
కానీ, నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ సామ్రాజ్యవాద అనుకూల విధానాలే అవలంబిస్తున్నాయన్నారు. అందులో భాగంగానే మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్యాన్ని వ్యాపారం చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు అవి అందకుండా చేస్తున్నాయన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇస్తూ, ఉన్నత విద్యను సామాన్యులకు అందకుండా చేస్తున్నారన్నారు.
మహిళలపై దాడులు, అత్యాచారాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామ్రేడ్ భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో విద్యార్థి, యువత, రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, ఐ.ఎఫ్.టీ.యు జిల్లా నాయకులు ఎం.సుధాకర్, పీవైల్ నాయకులు మారుతి గౌడ్, విఠల్, భాస్కరస్వామి, అశుర్, సాయితేజ, సూర్య, రత్న, నర్సక్క, గంగామణి, వినోద, గోదావరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.