కామారెడ్డి, ఫిబ్రవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తాడ్వాయి మండలం సంగోజివాడిలో శనివారం వసంతపంచమి సందర్భంగా శ్రీ సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉజ్వల భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని కోరారు. గ్రామంలో 100 శాతం అక్షరాస్యతను సాధించాలని పేర్కొన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించాలని చెప్పారు. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. సరస్వతి విగ్రహం ఏర్పాటుకు వితరణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి శ్రీకాంత్‌ను అభినందించారు.
అధిక సార్లు రక్తదానం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జమిల్ హైమద్, స్వచ్ఛంద కార్యకర్త బాలును అభినందించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కార్యక్రమంలో భాగస్వాములు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రీడ్ ఎంజాయ్, డెవలప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు.
35 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ సందర్భంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, ప్రధానోపాధ్యాయుడు మహేందర్, జిల్లా విద్యాధికారి రాజు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్, వైద్యులు శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న, డివిజన్ జనరల్ సెక్రెటరీ జమీల్ హైమద్, జిల్లా కార్యదర్శి రఘు కుమార్, ఎస్‌ఎంసి ప్రతినిధులు, వైద్య సిబ్బంది, యువజన సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.