నిజామాబాద్, ఫిబ్రవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా,పాజిటివ్ లైఫ్ శిక్షణ శనివారం నగరంలోని విశ్వశాంతి కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘు రాజ్, తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ చందుపట్ల ఆంజనేయులు, జిల్లా యోగ ప్రచారక్ ప్రవీణ్ కుమార్, విశ్వశాంతి విద్యాసంస్థల కరస్పాండెంట్ రోజా ప్రభాకర్ రావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వేద శ్రీ హాజరయ్యారు.
కార్యకమానికి అధ్యక్షోపన్యాసం చేసిన జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ యువత బాధ్యతగా వ్యవహరిస్తే సమాజంలోని ఎన్నో సమస్యలను సులభంగా ఎదుర్కోవచ్చునని దానికోసం మనమంతా కలిసి పని చెయ్యాలని సూచించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రఘు రాజ్ మాట్లాడుతూ యువత ఒత్తిడిని అధిగమించాలని, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం పెంచుకోవాలని, యువత దూరలవాట్లకు దూరంగా ఉండాలని, వ్యక్తిగత శుభ్రతను అలవర్చుకోవాలని సూచించారు.
ప్రొఫెసర్ ఆంజనేయులు మాట్లాడుతూ పాజిటివ్ థింకింగ్ వల్లే పాజిటివ్ లైఫ్ అలవడుతుందని, దానికోసం మనం సాధన చేయాలని సూచించారు. యోగాచార్య ప్రవీణ్ యువతీయువకులకు యోగా, ప్రాణాయామం లోని మెళకువలు నేర్పించారు. విద్యార్థులు శారీరకంగా ధృడంగా ఉంటేనే మానసిక ఆరోగ్యం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో విద్యాసంస్థల సిబ్బంది మార్కండేయ, అధ్యాపకులు, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు పాల్గొన్నారు.