నిజామాబాద్, డిసెంబరు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈరోజు కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది.
ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని, దేశ స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత దేశాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, భారతదేశం ప్రస్తుతం అభివృద్ధిలో ముందుకు వెళుతుంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రులు చేసిన కృషి వల్లనే అని అన్నారు.
సాగునీటి రంగంలో నిర్మించిన ప్రాజెక్టులు, విద్య రంగంలో నిర్మించిన యూనివర్సిటీలు, వైద్య రంగంలో నిర్మించిన ఆసుపత్రులు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారానే అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పక్షాన ,పేదల పక్షాన పోరాటం చేసి వారికి కూడు గుడ్డ ఇల్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు.
కానీ ప్రస్తుతం బిజెపి పార్టీ మరియు దాని అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కనబడకుండా అబద్దాపు ప్రచారాలను చేస్తూ చరిత్రను వక్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ విలువను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయని దీనిని ప్రజలు గమనిస్తున్నారని, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశంలో ఎడ్లబండ్ల లో ప్రయాణించే వారని దేశానికి విమానాలను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు.
వ్యవసాయ రంగంలో ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా భారతదేశం నిలవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ నిర్మించిన నాగార్జునసాగర్, బాక్రా నంగల్, పోచంపాడు వంటి ప్రాజెక్టుల వల్లనే అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అధికారంలో లేకున్నా బడుగు బలహీన వర్గాల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన పోరాటం చేస్తూ ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేస్తున్న భారత్ జోడో పాదయాత్ర దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఐక్యంగా ఉంచడానికి చూస్తుందొ అనేదానికి నిదర్శనం అని, ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్‌బిన్ హమ్దాన్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి భారత దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఏర్పాటైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, దేశాన్ని ఐక్యం చేయడానికి ప్రస్తుతం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేస్తున్నారని యాత్రలో భాగంగా రైతులను ,యువకులను, నిరుద్యోగులను, మహిళలను కలుస్తూ వారి బాధలు వింటున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా పరిపాలన చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేయాలని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి, జిల్లా ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడి భాగ్య, జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి, మాజీ పీసీసీ కార్యదర్శులు రామకృష్ణ, రాంభూపాల్, మాజీ పిసిసి డెలిగేట్ ఈసా, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, నిజామాబాద్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్, ఉబెద్ బీన్ హమ్దాన్, మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు తంబాకు చంద్రకళ, పోల ఉష, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు సిరికొండ గంగారెడ్డి, కేశ మహేష్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఆశాబి, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ సాయిలు, రాజ్ గగన్, ప్రమోద్, చింటూ, ముష్షు పటేల్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.