నిజామాబాద్, ఫిబ్రవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తమ శిక్షణలో భాగంగా క్షేత్ర స్థాయిలో వివిధ అంశాల అధ్యయనం కోసం నిజామాబాద్ కు హాజరైన మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రొబెషనరీ అధికారుల బృందం పర్యటన శనివారం ముగిసింది. 30 మందితో కూడిన అధికారులను ఆరు బృందాలుగా విభజిస్తూ, ఒక్కో బృందానికి ఒక గ్రామం చొప్పున క్షేత్రస్థాయి అధ్యయనం జరిపించారు. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్, సుంకెట్, దొన్కల్, నందిపేట మండలంలోని సిద్దాపూర్, వన్నెల్(కె), వెల్మల్ గ్రామాలతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రొబేషనరీ అధికారులతో కూడిన బృందాలు ఎనిమిది రోజుల పాటు వివిధ వర్గాల వారిని కలిసి వారి పనితీరును, ఆయా కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.
క్షేత్రస్థాయి అధ్యయనాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రైనీ అధికారులు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం సాయంత్రం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ లను కలిశారు. క్షేత్రస్థాయిలో తాము గమనించిన అంశాలను వారి దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న కార్యకలాపాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు తదితరుల పనితీరును క్షేత్రస్థాయి సందర్శనలో పరిశీలించిన అంశాలను తెలియజేశారు.

క్షేత్రస్ధాయి అధ్యయనానికి హాజరైన తమకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా తోడ్పాటును అందించిందని కృతజ్ఞతలు తెలుపుతూ వీడ్కోలు తీసుకున్నారు. ట్రైనీ అధికారులకు డీఆర్డీఓ సాయాగౌడ్, విజయేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు వీడ్కోలు పలికారు.