నిజామాబాద్, ఏప్రిల్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వివిధ పరిస్థితుల కారణంగా సమాజంలో దుర్భర స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్న వారికి తోడ్పాటుగా నిలిచేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున అందిస్తున్న చేయూతను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని గౌరవప్రదమైన జీవనాలు వెళ్లదీయాలని జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల హితవు పలికారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మినీ మోడ్యూల్ క్యాంపు నిర్వహించారు.
దాతల సహకారంతో పలువురికి కుట్టు మెషీన్లు, ప్రభుత్వ బాలికల పాఠశాలలు, డిచ్పల్లి మానవతా సదన్, కస్తూర్బా విద్యాలయాలకు సానిటరీ నాప్కిన్ వెండిరగ్ మెషీన్లు పంపిణీ చేశారు. లేబర్ డిపార్ట్మెంట్ తరపున అసంఘటిత రంగ కార్మికులకు గుర్తింపు కార్డులను, మెప్మా ఆధ్వర్యంలో 21 స్వయం సహాయక సంఘాలకు రూ. 2.50 కోట్ల విలువ గల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును అందజేశారు.
జిల్లా జడ్జితో పాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ, ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లు, అసంఘటితరంగ కార్మికులు వంటి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి, సమాజంలోని పేదరిక నిర్మూలనకు పాటుపడాలనే జాతీయ న్యాయ సేవా సంస్థ లక్ష్యానికి అనుగుణంగా డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో ఈ మోడ్యూల్ క్యాంపు ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఇదివరకు కూడా విద్యార్థినులు, యువతులకు స్వీయ రక్షణలో శిక్షణ కార్యక్రమాలను, పలువురికి అవుట్ సోర్చింగ్ పద్ధతిన ఉద్యోగాలను కల్పించామని, అనాధ బాలికలను దత్తత తీసుకుని కార్పొరేట్ విద్య సంస్థలలో చదివించడం జరుగుతోందని, డ్రగ్స్, మత్తు పదార్థాల పట్ల విద్యార్థులకు అవగాహన వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. ఏకకాలంలో 14 వేల మంది విద్యార్థినులు, యువతులకు కరాటే శిక్షణ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ లో నమోదయ్యిందని హర్షం వెలిబుచ్చారు.

జిల్లా యంత్రాంగంతో పాటు, అన్ని శాఖలు, అన్ని వర్గాల వారి సహకారంత్, తోడ్పాటుతోనే డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టగలిగామని అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక తోడ్పాటును అందించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అందించిన సహకారం మరువలేనిదని జిల్లా జడ్జి డీఎల్‌ఎస్‌ఏ తరపున కృతజ్ఞతలు తెలిపారు. వివిధ వర్గాల వారికి అందిస్తున్న తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ఎంతగానో పని ఒత్తిడితో కూడుకుని ఉండే విధుల్లో కొనసాగుతున్నప్పటికీ జిల్లా జడ్జి విస్తృత స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమాలలో జిల్లా యంత్రాంగం తరపున భాగస్వామ్యం అయ్యే అవకాశం లభించడం సంతోషాన్ని కలిగించిందని, ఇకముందు కూడా డీఎల్‌ఎస్‌ఏ కార్యక్రమాలకు తప్పనిసరిగా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
ఆయా వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న తోడ్పాటును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకున్నప్పుడే నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలకు సార్ధకత చేకూరుతుందని అన్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, పేదరికం అంటే కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదని, అందాల్సిన సేవలు అందకపోవడం, విద్య, వైద్య సేవలకు దూరంగా ఉండడం వంటివి కూడా పేదరికంగానే పరిగణించబడతాయని అన్నారు. ఎవరికి వారు తమ హక్కుల గురించి అవగాహన కలిగి ఉన్నప్పుడే, వాటిని పరిపూర్ణంగా పొందేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
ఏదైనా విషయంలో హక్కులకు భంగం కలిగితే వాటి కోసం వివిధ మార్గాలలో కృషి చేయవచ్చని సూచించారు. వివిధ వర్గాల వారికి డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో తోడ్పాటును అందించేందుకు జిల్లా జడ్జి కనబరుస్తున్న చొరవ ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. ఈ తరహా తోడ్పాటును సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కుట్టు మెషీన్లు, సానిటరీ నాప్కిన్ వెండిరగ్ మెషీన్లు సమకూర్చిన దాతలను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.