కామారెడ్డి, ఏప్రిల్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మహిళా సంఘాలు వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం లింగం పేట్ మండలం ముస్తాపూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా సంఘాలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సగం మహిళా సంఘాలకు కేటాయించాలని తెలిపిన మేరకు జిల్లాలో 183 కేంద్రాలు మహిళా సంఘాల ద్వారా కొనుగోళ్లు చేయడం జరుగుతున్నాయని తెలిపారు.
అనంతరం ముస్తాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి 149 దరఖాస్తులు రావడం జరిగాయని తెలిపారు. ఇళ్ల స్థలం ఉండి అర్హత కలిగిన కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి మార్క్ అవుట్ ఇవ్వాలని తెలిపారు. ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకునే విధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని తెలిపారు.
అనంతరం అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డ్ అందేవిధంగా వెరిఫికేషన్ చేయాలనీ తెలిపారు.
అనంతరం ఉపాధి హామీ పథకం క్రింద ఫిష్ పాండ్స్ నిర్మాణాల్లో కూలీలకు పనులు కల్పించాలని , జాబ్ కార్డ్ కలిగిన ప్రతీ కూలికి పనులు కల్పించాలని తెలిపారు. ఎన్.కే. అశోక్‌కు చెందిన ఒకటిన్నర గుంట భూమిలో ఫిష్ పాండ్ నిర్మించేవిధంగా చేపడుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ పనికి 1200 పనిదినాలకు సుమారు మూడు లక్షల కూలీ చెల్లించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇలాంటి వాటిని నిర్మించుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు.

అనంతరం నాగన్న బావిని కలెక్టర్ సందర్శించారు. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఇప్పటివరకు పర్యాటకుల సందర్శన రుసుము క్రింద రూ.42000 లు, వీడియో రుసుము క్రింద రూ.10,900 లు వసూలు చేయడం జరిగిందని, సందర్శకులు ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతున్న దృష్ట్యా శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమాల్లో ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ నరేష్, పంచాయతీ కార్యదర్శి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.