సాంఘిక బహిష్కరణలు విధించే వీడీసీలపై కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేడ్కర్‌ భవన్‌ లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేయగా, రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ అనిల్‌ ఈరవత్రి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, సామాజిక రుగ్మతలను, దురాచారాలను పారద్రోలేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో అణగారిన వర్గాలకు తగిన గౌరవం దక్కాలంటే విద్యతోనే సాధ్యం అని గుర్తించిన పూలే, విద్యను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారన్నారు. ప్రత్యేకించి బాలికల విద్య కోసం పాఠశాలలు నెలకొల్పి ప్రత్యేక కృషి కొనసాగించారని గుర్తు చేశారు.

అన్ని వర్గాలకు సమానత్వం ఉండాలన్నదే పూలే అభిమతం అని, ఆ దిశగా తుది వరకు తన కృషిని కొనసాగించారని కొనియాడారు. ఆయన చూపిన బాటలో పయనిస్తూ, పూలే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు మహనీయుల జీవిత చరిత్ర గురించి, వారు సమాజ అసమానతలకు వ్యతిరేకంగా జరిపిన పోరాటాల గురించి తెలుసుకోవాలని సూచించారు. మహనీయులను స్మరించుకుంటూ వారి ద్వారా ప్రజలు స్పూర్తి పొందాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం అధికారకంగా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోందని అన్నారు.

సాంఘిక బహిష్కరణలు విధిస్తే కఠిన చర్యలు

కాగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరిట సాంఘిక బహిష్కరణలు విధిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, అలాంటి వీ.డీ.సీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పూలే జయంతి వేదిక ద్వారా స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి వీ.డీ.సీలు కృషి కొనసాగిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదని, అందుకు భిన్నంగా వీడీసీ ముసుగులో చట్టాన్ని ఉల్లంఘించే చర్యలకు పూనుకుంటే ఎంతమాత్రం ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. సాంఘిక బహిష్కరణ ఫిర్యాదులపై పోలీస్‌ కమిషనర్‌ తో ఒకటి రెండు రోజుల్లోనే చర్చించి చట్ట ప్రకారం చర్యలు చేపట్టేలా చూస్తామని అన్నారు.

సాంఘిక బహిష్కరణలు వంటి రుగ్మతలకు వ్యతిరేకంగా వివిధ సంఘాలు కూడా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సమాజంలో ఇంకనూ అక్కడక్కడ నెలకొని ఉన్న వివక్షతను రూపుమాపేందుకు పూలే స్పూర్తితో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి అందించే ఈ.డబ్ల్యూ.సీ పత్రాలను సమగ్ర విచారణ జరిపి అర్హత కలిగిన వారికి మాత్రమే మంజూరు చేసేలా ఆర్డీఓలు, తహసీల్దార్‌ లకు ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. బీ.సీ స్టడీ సర్కిల్‌ భవన నిర్మాణం విషయంలో నెలకొని ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలిగేలా ప్రత్యేక చొరవ చూపుతామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ అనిల్‌ ఈరవత్రి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌ లు మాట్లాడుతూ, పూలే కృషిని కొనియాడారు. దాదాపు 200 సంవత్సరాల క్రితం అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలను పారద్రోలేందుకు జ్యోతిబాపూలే చేసిన కృషి అనన్య సామాన్యమైనదని అన్నారు.

అనేక అవరోధాలు, అవమానాలు ఎదురైనప్పటికీ ఏమాత్రం వెరువకుండా పూలే నాటి సాంఘిక దురాచారాలను తుదముట్టించేందుకు ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు. ముఖ్యంగా అణగారిన వర్గాలు, శూద్రులు సమానత్వం సాధించాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించి వారికి విద్య అందేలా తీవ్రంగా కృషి చేశారని, మహిళల విద్య కోసం ప్రత్యేకంగా మొట్టమొదటి పాఠశాలను స్థాపింపజేశారని అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే ఆలోచనలకు ప్రభావితమైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ పూలేను తన గురువుగా ప్రకటించారని తెలిపారు.

పూలే ఆశయాలు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, 57 వేల ఉద్యోగ నియామకాలు జరిపిందని, హాస్టల్‌ విద్యార్థులకు గణనీయంగా డైట్‌, కాస్మొటిక్‌ ఛార్జీలు పెంచిందని, యువత స్వయం ఉపాధి కోసం పెద్ద ఎత్తున రాయితీతో కూడిన రుణాలు అందించి వారు ఎంపిక చేసుకునే యూనిట్లను స్థాపించేందుకు ఆర్ధిక సహాయం అందించేలా రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు. పూలే వంటి మహనీయులు చూపిన బాటలో పయనిస్తూ వారి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే మన జీవితానికి కూడా సార్థకత చేకూరుతుందన్నారు.

కాగా, ఈ కార్యక్రమానికి ముందు వినాయక్‌ నగర్‌ హనుమాన్‌ జంక్షన్‌ వద్ద గల మహాత్మా పూలే విగ్రహానికి అర్బన్‌ ఎమ్మెల్యే ధన్పాల్‌ సూర్యనారాయణ, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, బీసీ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారిణి స్రవంతి, సహాయ అధికారి నర్సయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు గైని గంగారాం, బుస్స ఆంజనేయులు, నరాల సుధాకర్‌, మాడవేడి వినోద్‌ కుమార్‌,రవీందర్‌, బంగారు సాయిలు, రాజేశ్వర్‌, బుస్సాపూర్‌ శంకర్‌, పెద్ది రాములు, షేక్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »