నిజామాబాద్, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. నవీపేట్ మండలం నాగేపూర్, నిజాంపూర్, నాలేశ్వర్, నవీపేట్ లలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ శనివారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు.
ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. కాంటా చేసేందుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియచేయాలని రైతులకు సూచించారు. కాగా, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట లారీలలో లోడ్ చేయించి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట డీసీఓ శ్రీనివాస్ రావు తదితరులు ఉన్నారు.