పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు

నిజామాబాద్‌, డిసెంబరు 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్న నేపధ్యంలో, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా అన్ని హంగులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లి, దూస్‌గాం గ్రామాల్లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న మన ఊరు -మన బడి పనులను తనిఖీ చేశారు. ఇప్పటికే పూర్తయిన సివిల్‌ వర్క్స్‌తో పాటు పెయింటింగ్‌, సంప్‌, టాయిలెట్లు, కిచెన్‌ షెడ్లు, ఫ్లోరింగ్‌ తదితర నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

పనుల ఫినిషింగ్‌ అంతంతమాత్రంగానే ఉండడాన్ని గమనించిన కలెక్టర్‌ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత ఇంటి పని తరహాలోనే పాఠశాలల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన పనులు జరిగేలా చొరవ చూపాలని సంబంధిత అధికారులకు హితవు పలికారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని, పరిసరాలను అందంగా, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా చూడాలన్నారు.

ఉపాధి హామీ కింద మంజూరు చేసిన పనులను యుద్ద ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని, బిల్లులు సకాలంలో మంజూరు చేస్తామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు లోను కావాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే పనుల్లో జాప్యం జరిగిందని, తుది దశ పనులను నాణ్యతతో చేపడుతూ సత్వరమే పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట జిల్లా విద్యా శాఖ అధికారి దుర్గాప్రసాద్‌, పంచాయతీ రాజ్‌ ఈ.ఈ శంకర్‌, డిచ్పల్లి ఎంపీడీఓ గోపి తదితరులు ఉన్నారు.

గాడి తప్పిన మొక్కల నిర్వహణ .. అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

కాగా, డిచ్పల్లి నుండి మెంట్రాజ్‌పల్లికి వెళ్లే మార్గంలో మొక్కల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్‌ తన వాహనం నుండి దిగి మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులకు ఇరువైపులా హరితహారం మొక్కలు ఏపుగా పెరిగేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని పదేపదే సూచిస్తున్నప్పటికి, నిర్లక్ష్యం వహించడం ఏమిటని మండిపడ్డారు.

హరితహారం నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు.

Check Also

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »