కామారెడ్డి, మే 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 5 నుంచి ధరణి టౌన్షిప్‌లో ఓపెన్ ప్లాట్లు, వివిధ దశలో పూర్తయిన ఇండ్లను వేలంపాట ద్వారా విక్రయిస్తామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ హాజరై మాట్లాడారు.
జూన్ 5 నుంచి 8 వరకు కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో వేలం పాట ఉదయం 9 గంటల నుంచి కొనసాగుతుందని తెలిపారు. వేలంపాటలో పాల్గొనే వ్యక్తులు పదివేల రూపాయలు కలెక్టర్ కామారెడ్డి పేరుపై డిడి రూపంలో చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చని సూచించారు. వేలంలో పాల్గొనే వ్యక్తులు తమ వెంట ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వంటి గుర్తింపు పత్రాలు తీసుకురావాలని చెప్పారు.
100 గజాల ప్లాటు రూ.8 లక్షలతో రిజిస్ట్రేషన్ చార్జీలు కలుపుకొని సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ రహదారి 44 నుంచి 200 మీటర్ల దూరంలో ధరణి టౌన్షిప్ ఉందని తెలిపారు. ఎటువంటి చిక్కులు లేని ఓపెన్ ప్లాట్లు, వివిధ దశలో నిర్మాణం పూర్తయిన ఇండ్లు సొంతం చేసుకోవాలని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ రవీందర్, రాజీవ్ స్వగృహ ఏజీఎం సత్యనారాయణ, పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.