పోలింగ్‌ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న చేపట్టనున్న పోలింగ్‌ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్‌ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. నిజామాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ప్రిసైడిరగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులు, ఓ.పీ.ఓలకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌ లో శనివారం మొదటి విడత శిక్షణ తరగతులను నిర్వహించారు.

బ్యాలెట్‌ పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ పోలింగ్‌ ప్రక్రియలో ఓటింగ్‌ నిర్వహణకు ఒకింత ఎక్కువ వ్యవధి పట్టే అవకాశాలు ఉన్నందున ఓపిగ్గా, సంయమనంతో వ్యవరిస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. 27వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ సమయం ఉంటుందని, గడువు లోపు పోలింగ్‌ కేంద్రం పరిధిలో క్యూ లైన్‌ లో ఉన్న వారికి వరుస క్రమంలో టోకెన్‌ నెంబర్లు అందించి వారిచే ఓటింగ్‌ జరిపించాలన్నారు.

పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే ఈ నెల 26వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రిసైడిరగ్‌ అధికారులు తమ బృందంతో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. పంపిణీ కేంద్రాల వద్ద అందించే పోలింగ్‌ సామాగ్రి, బ్యాలెట్‌ బాక్సులను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, చెక్‌ లిస్ట్‌ లో పొందుపర్చబడిన దానికి అనుగుణంగా మెటీరియల్‌ అంతా కేటాయించబడినదా లేదా అన్నది జాగ్రత్తగా సరిచూసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు.

పోలింగ్‌ సామాగ్రిని పరిశీలించుకున్న మీదట తమ బృందంతో కలిసి అధికార యంత్రాంగం సమకూర్చిన వాహనంలోనే నిర్దేశిత పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ ఎంతో బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా పోలింగ్‌ ప్రక్రియను జరిపించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చిన్న తప్పిదానికి కూడా తావు లేకుండా పూర్తి పారదర్శకంగా, స్వేచ్చాయుత వాతావరణంలో ప్రశాంతంగా పోలింగ్‌ ప్రక్రియ జరిగేలా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. నిర్లక్ష్యానికి తావిస్తూ, తప్పిదాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ఓటర్లు, అభ్యర్థుల ఏజెంట్లు వివిధ అంశాలపై సందేహాలను లేవనెత్తే అవకాశాలు ఉన్నందున వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పి.ఓలదే అని అన్నారు. పోలింగ్‌ పూర్తయిన అనంతరం పక్కాగా రికార్డు బుక్కులలో వివరాలను పొందుపరుస్తూ నివేదిక తయారు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా పోలింగ్‌ డే సందర్భంగా పి.ఓ లు, ఏ.పీ.ఓలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి మాస్టర్‌ ట్రైనర్లు హన్మాండ్లు, వర్మ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. శిక్షణ తరగతుల్లో నిజామాబాద్‌ ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, నిజామాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఆయా మండలాల తహసీల్దార్లు, పీ.ఓలు, ఏ.పీ.ఓలు, ఓ.పీ.ఓలు పాల్గొన్నారు.

Check Also

‘ఆపద మిత్ర’ వాలంటీర్లకు ముగిసిన శిక్షణ

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విపత్తులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »