నిజామాబాద్, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నేరాలలో నేర నిరూపణ అయిన దోషులు న్యాయమూర్తుల పట్ల హింస ప్రవృత్తితో ప్రవర్తించడాన్ని సహించబోమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ హెచ్చరించారు.రంగారెడ్డి జిల్లాకోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న హరిష పై ఒక కేసులో నేర నిర్ధారణ అయిన దోషి ఒక వస్తువుతో దాడికి పాల్పడడం ఆందోళనకరమని ఆయన అన్నారు.
సదరు నేర ఘటనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ పిలుపు మేరకు జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్లో ఇలాంటి నేరపూరిత ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళ న్యాయమూర్తిపై దాడి న్యాయవ్యవస్థపై దాడిగా ఆయన అభివర్ణించారు. న్యాయమూర్తులకు అండగా న్యాయవాద సమాజం ఉంటుందని అన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ పరిధిలో న్యాయం సమపాళ్ళలో అందే విదంగా శ్రమిస్తారని పేర్కొన్నారు.
న్యాయస్థానాలలో నేర న్యాయ విచారణకు హాజరయ్యే నేర చరితగల ముద్దాయిల పట్ల కోర్టు భద్రత సిబ్బంది తగు జాగ్రతలతో వ్యవహరించాలని జగన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నేరమయ ముద్దాయిల పట్ల ముందస్తుగా సమాచారం తీసుకుని కోర్టులోకి భద్రత సిబ్బంది అనుమతించాలని తెలిపారు.
సీనియర్ న్యాయవాదులు ఎర్రం గణపతి, తుల గంగాధర్,గంగ ప్రసాద్,ఆశ నారాయణ, మద్దెపల్లి శంకర్ లు మాట్లాడుతు న్యాయమూర్తులు తమ విధినిర్వహణలో చట్ట ప్రకారమే వ్యవహరిస్తారని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న న్యాయవాదుల ఏకాభిప్రాయం మేరకు శుక్రవారం కోర్టుల విధులకు హాజరుకాకుండా నిరసన వ్యక్తం చేశారు. సమావేశంలో బార్ ఉపాధ్యక్షుడు పెండెమ్ రాజు, కార్యదర్శి సురేష్ దొన్పల్, న్యాయవాదులు దీపక్ మానిక్ రాజు, బాగిర్తి సాయిరెడ్డి, సదానంద్ గౌడ్, రత్నాకర్ రెడ్డి, విగ్నేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇంచార్జీ జిల్లాజడ్జికి వినతిపత్రం…
జిల్లాకోర్టు ప్రాంగణంలోని రెండవ అంతస్తులోని ఒక కోర్టు గది వద్ద అపరిచిత వ్యక్తుల చర్యలు అపాయకరంగా ఉన్నాయని, న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లే చర్యలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని బార్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ ఇంచార్జి జిల్లాజడ్జి కనక దుర్గకు వినతి పత్రం అందజేశారు.