కామారెడ్డి, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి మున్సిపల్ పరిధిలో శానిటేషన్, పార్క్‌ల నిర్వహణ, వాటరింగ్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలోని పార్క్ ను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. తొలుత పార్కును పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ పట్టణంలో పార్కు లను అభివృద్ధి పరచాలని, పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు ఏర్పాటు చేయాలని, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుచేయాలని తెలిపారు.
పార్క్ లలో మొక్కలు నాటి సంరక్షించాలని, గతంలో నాటిన మొక్కలకు వాటరింగ్ నిర్వహించాలని తెలిపారు. పార్కుల అభివృద్ధికి ఆయా వార్డుల్లోని వెల్ఫేర్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్స్ల సహకారం తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ అధికారులు పార్కుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని, షేడ్ కోసం గ్రీన్ నెట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణ రోజు వారీ నిర్వహించాలని, పట్టణంలో చెత్త కుప్పలు కనబడుతున్నాయని తెలిపారు.
పట్టణాన్ని సుందరంగా ఉంచే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. మోడల్ పార్కు లను తయారు చేయాలని, పార్కుల వద్ద విద్యుత్ బల్బ్‌లను ఏర్పాటు చేయాలని తెలిపారు. పట్టణంలో మున్సిపల్ ద్వారా చేపడుతున్న శానిటేషన్ పనులు, వాటరింగ్, పార్కుల అభివృద్ధి పనుల వివరాలు రోజు వారీ సమర్పించాలని తెలిపారు. అనంతరం పార్క్ లో కలెక్టర్ మొక్కను నాటి, నీళ్ళు పోశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రాజేందర్ రెడ్డి, డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, ఏఈ శంకర్, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.