నిజామాబాద్, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రానున్న వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ.శరత్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకితభావంతో పని చేయాలని, నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని హితవు పలికారు.
మంగళవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి జిల్లాలో మంచి నీటి సరఫరా పరిస్థితిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ఏడాది జిల్లాలో ఎక్కడ కూడా నీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని అధికారులను అభినందించారు. ఈ ఏడాది కూడా వేసవి సీజన్ ముగిసేంత వరకు అదే స్పూర్తితో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ఏదైనా నివాస ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు గమనించిన వెంటనే, ముందస్తుగానే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు.
బోరుబావుల మరమ్మతులు చేపట్టే మెకానిక్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, బోరు చెడిపోయిందన్న సమాచారం అందిన వెంటనే గంటల వ్యవధిలోపు మరమ్మతులు పూర్తి చేయించి దాహార్తి సమస్య ఏర్పడకుండా సత్వరమే పనులు జరిపించాలన్నారు. తాగునీటి సరఫరాను మెరుగుపర్చేందుకు చేపడుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలన్నారు. ఎక్కడైనా నీటి సమస్య ఏర్పడితే గ్రామ పంచాయతీలకు చెందిన ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే పక్క జీ.పీకి చెందిన ట్యాంకర్ ను కూడా వినియోగించుకోవాలని సూచించారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించేలా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. మండల ప్రత్యేక అధికారులు వారం వారం క్రమం తప్పకుండా మండలాల్లో పర్యటిస్తూ పర్యవేక్షణ జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పట్టణాలతో పాటు ఆయా మండలాలకు తాగునీటిని అందించే జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో అన్ని మండలాల్లో ఎంపిడిఓలు, ఎంపిఓలతో కూడిన క్లస్టర్ బృందాలు నిరంతరం నీటి సరఫరాను పర్యవేక్షించేలా చూస్తామన్నారు.
నీటి ఎద్దడి నెలకొనేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలలో ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని జిల్లా ప్రత్యేక అధికారి దృష్టికి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా నీటి సరఫరా సజావుగానే జరుగుతోందని, వేసవి సీజన్లో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే, తక్షణమే స్పందించి చర్యలు చేపట్టేవిధంగా అధికారులను, క్షేత్ర స్థాయిలో సిబ్బందిని అప్రమత్తంగా ఉంచుతామని అన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మిషన్ భగీరథ, ఆర్.డబ్ల్యు.ఎస్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.