నిజామాబాద్, మార్చ్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. కళాశాలలోని కిచెన్, డైనింగ్ హాల్, క్లాస్ రూమ్ లు, డార్మెటరీ, స్టోర్ రూం లను పరిశీలించారు. విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ, స్టోర్ రూంలను సందర్శించి, బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యతను, సరుకుల స్టాక్ ను పరిశీలించారు.
వంట నూనె, పాలు, పండ్లు, కోడిగుడ్ల నాణ్యత పరిశీలించిన కలెక్టర్, కాల పరిమితి ముగిసిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని నిర్వాహకులకు సూచించారు. నాణ్యతా లేమితో కూడిన నాసిరకం బియ్యం, ఇతర ఏవైనా సరుకులు పాఠశాలకు కేటాయించబడిన సందర్భాల్లో మండల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
పాఠశాల సముదాయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ పట్టికను పరిశీలించి, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఇంటర్ పరీక్షలు ఇప్పటికే ప్రారంభం అవగా, త్వరలో జరిగే టెన్త్ క్లాస్ వార్షిక పరీక్షల కోసం పదవ తరగతి బాలికలకు పునఃశ్చరణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాలలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు తక్షణమే పనులు జరిపిస్తామని అన్నారు.

అంతకుముందు కలెక్టర్ రెసిడెన్షియల్ స్కూల్ లో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గదులను సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను, సీ.సీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కాపీయింగ్ కు అవకాశం లేకుండా గట్టి నిఘా నడుమ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించకూడదని సూచించారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపల్ మాధవీ లత, స్థానిక అధికారులు ఉన్నారు.