కామారెడ్డి, ఏప్రిల్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం ఎల్లారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే, రేషన్ కార్డుల సర్వే, త్రాగునీటి సమస్యలు వంటి అంశాలపై ఎల్లారెడ్డి మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా నిరుపేదలకు ఇండ్లకు సిఫారసు చేయాలని సూచించారు.
అనర్హులకు ఎట్టి పరిస్థితులలో మంజూరు చేయరాదని అన్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావాలని తెలిపారు.ప్రతీ కుటుంబానికి ఒక ఇళ్లు మాత్రమే మంజూరు చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీ వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ/వార్డు సభలో లబ్ధిదారుల పేర్లు ఆమోదం పొందాలని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి స్వయం సహాయక గ్రూప్ నుండి ఒక లక్ష రూపాయలు రుణంగా మంజూరు చేయాలని తెలిపారు.
రేషన్ కార్డుల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని, జిల్లాకు ఒక కోటి రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని, అట్టి నిధులు గ్రామ పంచాయతీలకు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన మరమ్మత్తులకు అట్టి నిధులు వినియోగించుకోవాలని తెలిపారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, చందర్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, డివిజనల్ పంచాయతీ అధికారి సురేందర్, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.