కామారెడ్డి, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పచ్చదనం పారిశుద్ధ్య నిర్వహణతో అద్భుతంగా పనులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో రెవిన్యూ డివిజనల్ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, తహసీల్దార్లు, ఉపాధి హామీ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, జిల్లా అధికారులతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడారు. పల్లె ప్రగతిలో క్షేత్ర స్థాయి నుండి జిల్లా అధికారుల స్థాయి వరకు బాగా పని చేస్తున్నారని, ప్రజలకు మంచి చేసే పనుల వలన ఖచ్చితంగా గుర్తింపు వస్తుందని, తద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ఒక అద్భుత కార్యక్రమమని, గ్రామసీమల సౌభాగ్యానికి అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆశిస్తున్నానన్నారు.
హరితహారంలో నాటిన ప్రతి మొక్క బ్రతికేలా క్షేత్ర స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు కృషి చేయాలని, బండి చక్రాలుగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో జిల్లా ప్రగతిని సాధించాలని ఆయన ఆకాంక్షించారు. నూతన కలెక్టరేట్‌లో బిల్డింగ్ సముదాయం కన్నా పెద్ద మొక్కలతో, పూల మొక్కలు, పచ్చదనంతో ఉండడమే తనకు తృప్తి కలిగించిందన్నారు.
నేను పనిచేసిన కాలంలో అన్ని ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో కామారెడ్డి జిల్లా అన్ని రంగాలలో ముందుకు వెళ్ళడానికి దోహదపడిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి, జిల్లా మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డికి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌కి, పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్‌కి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దఫేదార్ శోభ రాజుకి, గౌరవ శాసనసభ్యులు శ్రీ హనుమంతు షిండే గారికి, శ్రీ జాజుల సురేందర్ గారికి, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు ఉద్యోగులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్‌గా ఉద్యోగోన్నతిపై వెళుతున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్‌కి జిల్లా యంత్రాంగం తరఫున అన్ని ఉద్యోగ సంఘాల తరఫున ఆత్మీయ సత్కారం చేశారు.
డిజిటల్ ఇండియా 2020 అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకోవడం, ఎలెట్స్ రెండవ జాతీయ నేషనల్ వాటర్, శానిటేషన్ అవార్డు కామారెడ్డి జిల్లాకు వరించడం జిల్లా కలెక్టర్ అవిరళ కృషికి నిదర్శనమని ఆత్మీయ సత్కారంలో జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు కొనియాడారు. ఒక నెలలోనే భూసంబంధమైన 200 జడ్జిమెంట్లు ఇచ్చిన ఘనత జిల్లా కలెక్టర్‌కి దక్కిందని అన్నారు.
కోవిడ్ నియంత్రణకు ఆయన ముందుండి అన్ని శాఖల సమన్వయంతో పాజిటివ్ రేటు నియంత్రించడంలో గొప్ప పాత్ర వహించారని, కామారెడ్డి జిల్లాలో జ్వరం సర్వే చూసే రాష్ట్రమంతటా జ్వర సర్వే ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేషనల్ హైవే సంబంధించి భూ సేకరణ పనులు అత్యంత వేగంగా నిర్వహించడం, వివిధ శాఖలకు సంబంధించిన ఫైల్స్, దరఖాస్తులను అదే రోజు పరిష్కరించడం ఆయన కృషికి నిదర్శనమని అన్నారు.
గత ఖరీఫ్, రబీలలో నిర్ణీత సమయం కన్నా ముందే ధాన్యం కొనుగోలు పూర్తిచేసి సకాలంలో రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడం ఆయన ప్రతిభకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలకు సంబంధించి కామారెడ్డి జిల్లాలోనే ముందుగా రైతు వేదికలు పూర్తి చేయడం జరిగిందని, అలాగే పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ గ్రామాలు, డంపింగ్ యార్డ్‌లకు సంబంధించిన భూసేకరణ వెంటనే పూర్తిచేయడం ఆయన కార్యదీక్షకు నిదర్శనమని అన్నారు. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన ఉపాధి హామీ పనులలో దేశంలో మూడవ స్థానం, రాష్ట్రంలో మొదటి స్థానం పొందడం ఆయన కర్తవ్య దీక్షకు దర్పణమని అన్నారు.
ఆత్మీయ సత్కారం కార్యక్రమానికి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సభాధ్యక్షులుగా, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఆర్‌డీఓలు ఎస్.శీను, రాజాగౌడ్, జిల్లా పరిషత్ సీఈవో సాయిగౌడ్, జిల్లా అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. రాజారాం, తెలంగాణ గజిటెడ్ అధికారుల జిల్లా అధ్యక్షులు దేవేందర్, తెలంగాణ నాన్ గజిటెడ్ జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి, జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఎంపిఓ, ఎంపిడిఓ సంఘాల అధ్యక్షులు, ఉద్యోగులు జిల్లా కలెక్టర్‌కు గజమాల, శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు.
అనంతరం కలెక్టరేట్ ఆరుబయట జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్. శ్వేత, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఉద్యోగులతో జిల్లా కలెక్టర్ ఫోటో సెషన్ కార్యక్రమం జరిగింది.