మాతా శిశు ఆరోగ్య కేంద్రం సేవలు సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుఖ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు అంగన్‌వాడి, ఆరోగ్య కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బాన్సువాడలో శుక్రవారం రూ.17.80 కోట్లతో నిర్మించిన 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలకు భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్‌ మాట్లాడారు. నేటి నుంచి మాతా శిశు ఆరోగ్య కేంద్రం సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్‌వాడి కార్యకర్తలు గర్భిణీలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని, పౌష్టికాహారం తినడంవల్ల గర్భిణీలు సుఖప్రసవం అయ్యే అవకాశాలు ఉంటాయని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మూడు మాసాల గర్భిణీలకు మధ్యాహ్నం ఒక పూట కడుపునిండా భోజనం పెట్టి, పాలు ఇస్తున్నారని అవకాశాన్ని గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బాన్సువాడలో జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు 1650 ప్రసవాలు జరిగినట్లు చెప్పారు. వీటిలో 64 శాతం సాధారణ ప్రసవాలు అయ్యాయని, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపి 100 శాతం సుఖ ప్రసవాలు అయ్యేవిధంగా చూడాలని కోరారు. గ్రామాల్లో ఉన్న గర్భిణీలకు పురిటి నొప్పులు వస్తే 102 అమ్మఒడి వాహనం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి చేర్పించే వీలుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరుపేదలకు అండగా ఉండాలని కెసిఆర్‌ కిట్‌ ను ప్రవేశపెట్టి ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచే విధంగా కృషి చేశారని కొనియాడారు.

కోటి రూపాయలతో రక్త సేకరణ బ్యాంకును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కరోనా రోగులకు బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో పైప్‌ లైన్‌ ద్వారా ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. పేద ప్రజలు వైద్యశాలను దేవాలయంగా భావిస్తారని చెప్పారు. వైద్యులు, స్టాఫ్‌ నర్సులు విసుక్కోకుండా ఉన్న సౌకర్యాలు అందజేసి రోగులను సంతోషంగా ఇంటికి పంపే విధంగా సహకరించాలని పేర్కొన్నారు. బాన్సువాడలో 40 కోట్లతో నర్సింగ్‌ కళాశాల, హాస్టల్‌ మంజూరైనట్లు తెలిపారు. ఈ సంవత్సరం బైపిసి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులు వంద మందికి ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తారని చెప్పారు.

సోమేశ్వర్‌ వద్ద రూ.3 కోట్లతో పాల సేకరణ కేంద్రం నిర్మించామని చెప్పారు. రోజుకు 20 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న పాలను శీతలీకరణ కేంద్రంలో నిల్వ ఉంచుకోవచ్చని సూచించారు. రైతులు పాడి గేదెలను శ్రీనిధి, ఇతర బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. కావలసిన రైతులు స్థానిక సర్పంచ్‌లకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ శోభ రాజు మాట్లాడుతూ, శాసన సభాపతి సహకారంతో తనకు ప్రజాసేవ చేసే అవకాశం రావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. బాన్సువాడలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సూచించారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ మాట్లాడుతూ బాన్సువాడలో వంద పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి, 100 అంగన్‌వాడి కేంద్రాల భూమిపూజ కార్యక్రమానికి తాను హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు. ఆరోగ్య సేవలు గ్రామస్థాయి పేదలకు అందేలా ఆరోగ్య, అంగన్‌వాడి కార్యకర్తలు చూడాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, మున్సిపల్‌ చైర్మన్‌ గంగాధర్‌, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజి రెడ్డి, జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌, బాన్సువాడ, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు డాక్టర్‌ శ్రీనివాస ప్రసాద్‌, డాక్టర్‌ అజయ్‌ కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి సరస్వతి, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సహకార సంఘాల చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »