నిజామాబాద్, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్ నెల నుండి వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచుతూ జూన్ నెలలో జీవో నెంబర్ 60 విడుదల చేసిందన్నారు. జీవో ప్రకారం వివిధ కేటగిరీల వారీగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెరగాల్సి ఉండగా నేటికీ అమలు కాకపోవడం దుర్మార్గమన్నారు. వెంటనే కేటగిరీల వారీగా వేతనాలు పెంచుతూ వచ్చిన జీవో నంబర్ 60ని మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల కొత్తగా నియమించబడిన మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లకు వేతనాలు పెండిరగ్‌లో ఉన్నాయని, వారందరికీ వెంటనే బకాయిలు చెల్లించాలన్నారు. కార్మికులందరికీ ప్రతి నెల 1వ తేదీన వేతనాలు వచ్చేట్టు చర్యలు తీసుకోవాలన్నారు. వారంరోజుల్లో డిమాండ్లను పరిష్కారం చేయకపోతే ఈ నెల 13న కార్మికులు విధులు బహిష్కరించి చలో కలెక్టరేట్ చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఏ.ఐ.టి.యు.సి భాద్యులు ఓమయ్య, సీఐటీయూ భాద్యులు గోవర్ధన్, ఐ.ఎఫ్.టి.యు నాయకులు కే. రాజేశ్వర్, శివకుమార్ ఏ.ఐ.టి.యు.సి నాయకులు సుధాకర్, నర్సింగరావు సి.ఐ.టి.యు నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు.