నిజామాబాద్, సెప్టెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పౌరుల వ్యక్తిగత ఆర్థిక ఎదుగుదల పైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉన్నదని, కక్షలు, కార్పణ్యాలతో అభివృద్ధికి ఆటంకాలేనని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ ఎస్.గోవర్ధన్ రెడ్డి అన్నారు. పౌరుల మధ్య పట్టువిడుపులుంటేనే ప్రగతి వైపు పయనం ఆటంకాలు లేకుండా వెలుతుందని ఆయన తెలిపారు.
జిల్లాకోర్టు ప్రాంగణంలోని సంస్థ కార్యాలయం న్యాయసేవా సదన్‌లో జాతీయ లోక్ అదాలత్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రధానోపన్యాసం చేశారు. ప్రజలకు న్యాయ విజ్ఞానాన్ని అందించడం, సివిల్, నేర వివాదాలను న్యాయార్ధుల అభీష్టం మేరకు పరిష్కరించడం, అందరు చట్టాన్ని అనుసరిస్తు జీవన విధానాలను కొనసాగించు కోవడం ప్రధాన లక్ష్యాలుగా న్యాయసేవా సంస్థ తోడ్పాటునందిస్తున్నదని పేర్కొన్నారు. న్యాయ సంబంధిత వివాదాలను ఇరుపక్షాలు రాజీపద్దతిన పరిష్కరించుకోవడంలో ఇరుపక్షాల విజయాలు ఉన్నాయని వివరించారు.
చిన్న, చిన్న నేరాలకు సంబంధించిన కేసులను న్యాయస్థానాలలో జరిమానా చెల్లించడం ద్వారా పరిష్కరించుకోవచ్చని దీనితో విలువైన సమయాన్ని ఇతర ధైనందిని పనులకు ఉపయోగించుకోవచ్చని అన్నారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న జాతీయ లోక్ అదాలత్‌కు జాతీయ ప్రధాన్యం ఉన్నదని జనహితమే జీవనాడిగా జనంతో మమేకమైనది జిల్లాజడ్జి తెలిపారు. అదనపు జిల్లాజడ్జిలు షూకత్ జహన్ సిద్ధికీ, పంచాక్షరీ మాట్లాడుతు న్యాయ, శాసన, కార్యనిర్వాహక వర్గానికిు తోడుగా మీడియా, సమాజ సహకారం తీసుకుని న్యాయసేవలను విస్తృతం చేద్దామని అన్నారు.
న్యాయవ్యవస్థకు బాసటగా నిలిచి బాధ్యతల బరువు పంచుకుంటున్నామని అసిస్టెంట్ కలెక్టర్ బి.చంద్రశేఖర్,డిప్యూటీ పోలీస్ కమిషనర్ అరవింద్ తెలిపారు. కార్యక్రమంలో న్యాయసేవా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్, జూనియర్ సివిల్ జడ్జిలు కళార్చన, పెద్ది చందన, సౌందర్య, గిరిజ, భవ్య, ప్రభుత్వ న్యాయవాది ఈగ గంగారెడ్డి, బార్ అధ్యక్షుడు రాజారెడ్డి, సంస్థ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, మానిక్ రాజ్, జగన్ మోహన్ గౌడ్, ఆశా నారాయణ, న్యాయసేవా సంస్థ పర్యవేక్షకుడు పురుషోత్తం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కక్షిదారులతోకోర్టు ప్రాంగణాలు కళ కళ…..
ఆర్మూర్, బోధన్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి న్యాయస్థానాలతో పాటు నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణాలు వందలాది మంది కక్షిదారుల రాకతో కళ కళలాడాయి. ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రతి కక్షిదారుని పరిశీలించి కోర్టులలోకి అనుమతించారు.
కేసులకు అవార్డులు జారీ…
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్ కేసులు మొత్తం 1025 పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాధం విక్రమ్ తెలిపారు. ఇందులో 46 మోటారు రోడ్డు ప్రమాద నష్టపరిహార దావాలు భీమా కంపెనీలు, బాధితుల ఉమ్మడి అంగీకారం మేరకు అవార్డులు జారీచేసి 3 కోట్ల 63 లక్షల 3 వేల 86 రూపాయలు బాధితులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. బ్యాంకులకు సంబంధించి 231 సివిల్ దావాలలో ప్రభుత్వ రంగ సంస్థలు స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకులకు ఋణగ్రహితలు దాదాపు 98 లక్షల 47 వేల 121 రూపాయలు చెల్లించడానికి అంగీకారం కుదిరాయని తెలిపారు.