నిజామాబాద్, సెప్టెంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్ ల రద్దుకై ఐఎఫ్‌టియు జాతీయ కమిటీ పిలుపుమేరకు ఈనెల 20న కార్మిక శాఖ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం కోటగల్లిలో ఎన్‌ఆర్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు ఉపశమన చర్యలు తీసుకోక పోగా, ప్రజావ్యతిరేక నిర్ణయాలు చేస్తుందని ఆరోపించారు. కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగానే నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్లు తీసుకొచ్చిందన్నారు. కార్మిక వ్యతిరేక కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్త నిరసన ప్రదర్శనల్లో భాగంగా ఈనెల 20న ఐ.టి.ఐ గ్రౌండ్ నుండి ర్యాలీ నిర్వహించి, కార్మిక శాఖ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు.
కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ ధర్నాలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కే.రాజేశ్వర్, విఠల్, కిరణ్, తిరుపతి, శివకుమార్, రాము, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.