డిచ్‌పల్లి, సెప్టెంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత నెల రోజులుగా ఔట్ సోర్సింగ్ ప్రతిపాధికన భర్తీ చేస్తున్న ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, వేరే జిల్లా వారిచే భర్తీ చేయకూడదని వైస్ ఛాన్స్‌లర్ రవీందర్‌కి టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రం అందజేశారు. తెలంగాణ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, కుక్, స్వీపర్, అటెండర్, సెక్యురిటి గార్డ్, లాబ్ అసిస్టెంట్, ఇతర నాన్ టీచింగ్ పోస్టుల ఉద్యోగాల భర్తీలో స్థానికులకే నియమించాలని, గతంలో తీసివేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
జరుగుతున్న ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరగకుండా చూడాలని నాన్ లోకల్‌గా ఉన్నటువంటి వారిని తొలగించాలని విసికి తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీ లో 10 మంది రిటైర్డ్ ఉద్యోగులను నియమించారు, వారిని వెంటనే తొలగించి అర్హత కలిగినటువంటి స్థానికులకు ఉద్యోగం కల్పించాలని కోరారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌వి నాయకులు మధుకర్ రెడ్డి ఉన్నారు.