గల్ఫ్‌ బాధితులను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ బాధితులు తిరిగి వచ్చే స్థిరపడడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ముప్కాల్‌ మండలం నల్లూరులో రు. కోటి 25 లక్షలతో ఏర్పాటు చేసే 33/11 కెవి సబ్‌ స్టేషన్‌కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు.

భీంగల్‌ మండల కేంద్రంలో న్యాక్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 25 మంది కుట్టు మిషన్లు, 210 మందికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ ధ్రువ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన మేరకు ప్రతి రైతుకు నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన కరెంటు అందించాలని, గ్రామాలలో కూడా నాణ్యమైన కరెంటు అందివ్వాలని ముఖ్యమంత్రిని అడగగానే కోటీ ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి నల్లూరు గ్రామంలో సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

బాల్కొండ నియోజకవర్గంలో ఇది 16వ సబ్‌ స్టేషన్‌ అని, 6 నుండి ఏడు సంవత్సరాల కాలంలోనే 16 సబ్‌స్టేషన్లు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ దేనని 52 ట్రాన్స్‌ఫార్మర్స్‌ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది పేద వారికి రు. 2 వేలు, 3 వేలు పెన్షన్‌ ఇస్తున్నామని, సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల మీద పెడుతున్న ఖర్చు 8 వేల కోట్ల రూపాయలని అందులో కేంద్రం 2 వందల కోట్లు ఇస్తుందన్నారు.

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు రెండు సంవత్సరాల నుండి కరోనా కారణంగా అనుకున్న సమయానికి కట్టలేక పోయామని కానీ కట్టించి మాత్రం ఇస్తామన్నారు. ఒక్క డబుల్‌ బెడ్‌ రూమ్‌కు అయ్యే ఖర్చు 5 లక్షల 4 వేల రూపాయలు కాగా, కేంద్రం ప్రభుత్వం అందులో డెబ్బై రెండు వేలు ఇస్తుందన్నారు. ఎకరాకు 10,000 రూపాయలు రైతుబంధు ఐదు లక్షల రైతు బీమా సౌకర్యం కల్పించిన ప్రభుత్వం తమదేనని అన్నారు.

భీమ్‌గల్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి ప్రాంతాలలో అనేక రకాల బాధలతో యువత గల్ఫ్‌ దేశాలకు వెళ్లి బాధపడడం చూసి వారిని ఆదుకోవాలని నైపుణ్య శిక్షణ ఇప్పించడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు తేవడానికి చెక్‌ డ్యాములు కట్టడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం 20 వేల ఎకరాలకు ప్యాకేజీ 21 ద్వారా పైప్‌లైన్‌ ద్వారా నీళ్లు తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నామని, పోచంపాడు నుండి బినోల నుండి పైప్‌లైన్‌ ద్వారా పంటలకు నీళ్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

నైపుణ్య శిక్షణతో హైదరాబాద్‌లో గల కంపెనీలలో ఉద్యోగాలు దొరుకుతాయని తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించడం ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా నైపుణ్య శిక్షణ పొందినవారికి సహకారం ఇస్తున్నామన్నారు. నైపుణ్యం కలిగి ఉండాలని శిక్షణతో ధైర్యం వస్తుందని స్త్రీలకు కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక లక్ష 33 వేల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని అందరికీ ఉద్యోగాలు కల్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదన్నారు.

కేటీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో ఇండస్ట్రీస్‌ పెరుగుతున్నాయని, కొత్త కొత్త పరిశ్రమలు వస్తున్నాయని, లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. శిక్షణ పొందిన తర్వాత లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ఐడీ కార్డు పొందాలని తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రాజశ్రీ లక్ష్మణ్‌, అధ్యక్షులు మహేష్‌, జెడ్పిటిసి రవి, ఆర్‌డిఓ శ్రీనివాస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈ.డి. రమేష్‌, శిక్షణ సంస్థ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌, జడ్పి కోఆప్షన్‌ మెంబెర్‌ వాయిస్‌ మున్సిపల్‌ కమిషనర్‌ గంగాధర్‌, తహసిల్దార్‌, ఎంపిడిఓ, డిఎల్‌పిఓ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »