కామారెడ్డి, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు పంట రుణాలు 100 శాతం ఇచ్చే విధంగా బ్యాంక్ మేనేజర్లు చూడాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం బ్యాంకు అధికారులతో రుణాల లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని సూచించారు. గోదాముల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 62 శాతం పంట రుణాలను బ్యాంక్ అధికారులు అందజేశారని చెప్పారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు వేదికల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి అర్హతగల రైతులందరికీ పంట రుణాలు ఇప్పించాలని సూచించారు.
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు 63% అందజేశారని తెలిపారు. 100 శాతం లక్ష్యాలను పూర్తిచేయాలని ఐకేపీ, బ్యాంకు అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో ఇన్చార్జి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజేందర్ రెడ్డి, ఆర్‌బిఐ ఏజీఎం శరత్, నాబార్డ్ డిడి ఎం నగేష్, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల అధికారులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.