నిజామాబాద్, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి దళిత కుటుంబానికి లబ్ది చేకూర్చాలన్న సదాశయంతో ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో వంద మంది చొప్పున లబ్దిదారులను ఈ పథకం కింద ఎంపిక చేయడం జరుగుతుందని, దశల వారీగా దళిత కుటుంబాల వారందరికీ ఇది వర్తిస్తుందని తెలిపారు.
దళిత బంధు పథకం అమలుకై కొనసాగిస్తున్న సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా గురువారం స్థానిక ప్రగతి భవన్‌లో మాస్టర్ ట్రైనీలుగా ఎంపిక చేసిన నియోజకవర్గ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శిక్షణ తీసుకుంటున్న అధికారులంతా సోమవారం నుండి మండల, గ్రామా స్థాయి కమిటీలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా శిక్షణలో అన్ని అంశాలను బాగా ఆకళింపు చేసుకుని దళిత బంధు విజయవంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని మాస్టర్ ట్రైనీలకు సూచించారు.
దళిత కుటుంబాలు స్వయం సమృద్ధి సాధించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాల్సిన గురుతర బాధ్యతను గుర్తెరిగి పని చేయాలని హితవు పలికారు. దళిత బంధు పథకంపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకుని, లబ్ధిదారులకు యూనిట్ల స్థాపన విషయంలో స్పష్టమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పథకం ప్రాధాన్యతను గుర్తిస్తూ నిబద్దతతో పని చేసినప్పుడే దళితబంధు విజయవంతం అవుతుందన్నారు.
ఒకటికి పది పర్యాయాలు లబ్ధిదారుల ఇళ్లకు తిరుగుతూ, వారితో మమేకం కావాలన్నారు. ఏ యూనిట్‌ను స్థాపిస్తే బాగుంటుంది అన్న దానిపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అయితే యూనిట్ల ఎంపిక విషయంలో లబ్ధిదారులకే పూర్తి స్వేఛ్ఛ ఇవ్వాలని, వారికి అనుభవం, ఇష్టం కలిగి ఉన్న రంగాల్లో యూనిట్లను నెలకొల్పేందుకు తోడ్పాటును అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యూనిట్ల ఎంపికలో అధికారులు తాము సూచించిన వాటినే పెట్టాలంటూ బలవంతం చేయకూడదని అన్నారు.
అదే సమయంలో లబ్ధిదారుడు కోరుకుంటున్న యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంటే కలిగే ప్రయోజనాలు, మార్కెట్ స్థితిగతులు, లాభనష్టాల గురించి అన్ని అంశాలను వారికి తెలియజేయాలన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో, సృజనాత్మకతతో కూడిన యూనిట్‌లను లబ్ధిదారులు ఎంపిక చేసుకునేలా వారికి పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, ఆర్దీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.