అరవింద్
శుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. భిక్కనూరు మండలం జంగంపల్లి లో సోమవారం పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో పారిశుద్య పనులను ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామాలలో తిరిగి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారించాలన్నారు. వాటి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని కోరారు. వానకాలంలో అంటు వ్యాధులు రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతి వార్డు లో ఖాళీగా ఉన్న స్థలాలను ఎంపిక చేసి హరిత హారంలో మొక్కలు నాటాలన్నారు. మురుగు కాలువలు, మంచి నీటి ట్యాంకులు శుభ్రంగా ఉంచాలని కోరారు. గ్రామాల్లో పైప్ లైన్ లీకేజీలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చి వేసి, వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా చూడాలన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని కోరారు. గ్రామంలో మూడు ఎకరాల ఖాళీ స్థలాన్ని గుర్తించి పలు రకాల పండ్ల మొక్కలను నాటాలని పేర్కొన్నారు. పనులు చేపట్టడానికి ముందు, చేపట్టిన తర్వాత ఫోటో ఆల్బమ్ తయారు చేసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిపిఓ సాయన్న, ఎంపీడీవో అనంతరావు, సర్పంచ్ నరసింహులు యాదవ్ , వార్డు సభ్యులు పాల్గొన్నారు.