హైదరాబాద్, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లే వారికి, విదేశాల నుండి సెలవుపై వచ్చిన వారికి ప్రాధాన్యతతో కోవిడ్ టీకాలు ఇవ్వాలని భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు పొందిన తెలంగాణ రాష్ట్రంలోని రిక్రూటింగ్ ఏజెన్సీల సంఘం ‘ఓవర్సీస్ మ్యాన్‌పవర్ రిక్రూటర్స్ అసోసియేషన్’ (ఓమ్రా) అధ్యక్షులు డి ఎస్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంగళవారం లేఖ రాశారు.
లేఖ ప్రతిని మంత్రి కేటీఆర్, హైదరాబాద్ లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఇ) ముకేశ్ కౌశిక్ లకు కూడా పంపారు.
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చిన విధంగానే వీరికి కూడా టీకాలు వేయాలని, టీకా సర్టిఫికెట్‌లో పాస్‌పోర్ట్ నంబర్‌ను చేర్చాలని కోరారు. కేరళలో టీకా సర్టిఫికెట్లలో పాస్‌పోర్ట్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తున్నారని అన్నారు.
విదేశాలకు కొత్తగా ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే ఆశావహులు, విదేశాల నుండి సెలవుపై వచ్చిన లక్షలాది మంది భారతీయ పౌరులు కోవిడ్19 పరిమితుల కారణంగా ప్రయాణించలేని పరిస్థితిలో ఉన్నారు.
టీకాలు తీసుకున్న ప్రయాణికుల ప్రవేశాన్ని గల్ఫ్ దేశాలు అనుమతిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఓ) అనుమతించిన ‘కోవిషీల్డ్’ వాక్సిన్ భారత్ లో అందుబాటులో ఉందని డి ఎస్ రెడ్డి అన్నారు.
విదేశీ ఉద్యోగార్ధులకు కోవిషీల్డ్ టీకా లభ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇది వలస కార్మికులకు గొప్ప ఉపశమనం కలిగిస్తుందని, ఎటువంటి సమస్యలు లేకుండా విధుల్లో చేరడానికి, వారి ఆర్థిక సమస్యల నుండి బయటకు రావడానికి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు. సకాలంలో ప్రయాణించకుంటే పొరుగు దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశమున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
విదేశీ ఉద్యోగాల కల్పనలో తాము ప్రముఖ పాత్ర పోషిస్తూ, నిరుద్యోగ సమస్యను తీరుస్తున్నామని అన్నారు. మేము పంపిన కార్మికులు ప్రతి ఏటా 80 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఇంటికి పంపించడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభంగా ఉన్నారని అన్నారు.