నిజామాబాద్, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఆక్సిజన్ మన దగ్గరే జనరేట్ చేసుకుంటే పేషెంట్లకు మరింత నమ్మకంగా ట్రీట్మెంట్ ఇవ్వవచ్చని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు.
బుధవారం కలెక్టరేట్ లో సిఐఐ, టిసిఎస్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా జనరల్ ఆసుపత్రికి 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను విరాళంగా కలెక్టర్‌కు అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో ఆక్సిజన్ కు ఎంత ప్రాముఖ్యత ఏర్పడిందో మనందరికీ తెలిసిన విషయమేనని ఆక్సిజన్ అందక కొందరు ప్రాణాలు కూడా వదిలారని, అట్లాంటి ఆక్సిజన్‌ను సిలిండర్ తో సంబంధం లేకుండా సెల్ఫ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చని, జిజిహెచ్ సిఐఐ, టిసిఎస్ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో జిజిహెచ్ కు 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ను డొనేట్ గా ఇవ్వటం ఎంతైనా అభినందనీయమని అన్నారు.
విపత్కర పరిస్థితులలో ఆక్సిజన్ బయటనుంచి తీసుకురావడం పేషెంట్‌కు అందించడం ఎంత సమస్యతో కూడుకున్నదని మనందరికీ తెలుసునని చెప్పారు. మన దగ్గరే ఆక్సిజన్ జనరేట్ చేసుకుంటే చాలా వరకు పేషెంట్ కు నమ్మకంగా ట్రీట్మెంట్ ఇవ్వవచ్చునని, ఈరోజు అవి అందుబాటులోకి రావడం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు గొప్ప సదుపాయమని అన్నారు.
వీటి ద్వారా ఆసుపత్రికి వచ్చే నిరుపేద పేషెంట్లకు కూడా మెరుగైన వైద్యం ఇవ్వగలుగుతామని అన్నారు. వారికి ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం కలుగుతుందన్నారు.
ఈ సందర్భంగాసిఐఐ, టిసిఎస్ కంపెనీల వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అన్నారు. రోటరీ క్లబ్ నిజామాబాద్ జిల్లాలో ఎప్పటికప్పుడు ఈ ట్రీట్మెంట్ కు సపోర్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్న ఈ విపత్కర సమయంలో ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉందని, అందరి సామాజిక బాధ్యత కూడా అని, ప్రస్తుత కరోనా రెండో వేవ్ నుంచి కోలుకుంటున్నామని, థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారని, రావద్దని కోరుకుందాం, ఒకవేళ వస్తే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడిసన్, మ్యాన్పవర్ పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వివరించారు.
ఇందులో ప్రతి ఒక్కరూ తమ వంతుగా ముందుకు రావాలని కోరుకుంటున్నానని, థర్డ్ వేవ్ వస్తే పిల్లలకు ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారని, మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి తగ్గట్టు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దురదృష్టవశాత్తు వస్తే సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఏ ఒక్క పిల్లాడికి ఇబ్బంది కలగకుండా ఏ ఒక వ్యక్తికి ఇబ్బంది కలగకుండా ఎదుర్కొనే విధంగా ముందుకు సాగాలని అన్నారు.
కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, రోటరీ క్లబ్ అధ్యక్షులు దర్శన్ సింగ్ , సెక్రెటరీ బాబురావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.