గాంధారి, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కానిస్టేబుల్ గా పనిచేస్తున్న భార్య, ఓ ఎస్ఐ వేదింపులు భరించలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్తులు, స్థానిక ఎస్ఐ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర లోని దెగ్లూర్ కు చెందిన పెద్దోళ్ల శివాజీ (35) గాంధారి మండలం మాధవపల్లి గ్రామానికి ఇల్లరికం అల్లుడుగా 15 సంవత్సరాల క్రితం వచ్చాడు. అప్పుడు అతనికి గ్రామానికి చెందిన పెద్దోళ్ల రజిత తో వివాహం జరిగింది.
తర్వాత ఒక సంవత్సరం తర్వాత శివాజీ భార్య రజిత ఒక పాపకి జన్మ నిచ్చి చనిపోయింది. దాంతో కుల పెద్దలు, గ్రామస్థులు రజిత చెల్లెలు సంతోషికి ఇచ్చి శివాజీ తో వివాహం జరిపించి అదే ఇల్లరికాన్ని కొనసాగించారు.
పెళ్లి అయినా తర్వాత శివాజీ తన భార్య సంతోషిని చదివించి కానిస్టేబుల్ గా ఉద్యోగం ఇప్పించాడు. భార్య సంతోషి ప్రస్తుతం కామారెడ్డి ఎస్పి కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంది.
ఈ క్రమంలో కానిస్టేబుల్ సంతోషి నిజామాబాదు జిల్లా ఇందల్వాయి లో పనిచేస్తున్న ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇద్దరు కలిసి తిరుగుతుండడం తెలిసిన భర్త శివాజీ చాలా సార్లు భార్య సంతోషి ని నిలదిసేవాడు.
బంధువులు, గ్రామస్తులు అందరూ చాలా సార్లు పంచాయతీ పెట్టి సముదాయించే ప్రయత్నం చేశారు. ఇదేమి పట్టని కానిస్టేబుల్ సంతోషి తన ప్రియుడు ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి తో తన భర్త శివాజీ ని కొట్టించేదని గ్రామస్తులు తెలిపారు.
నేరుగా ప్రియుడిని మాధవపల్లి లోని ఇంటికే పిలిపించుకునేది అని అన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాత శివాజీ భార్య సంతోషితో కలిసి కామారెడ్డి లో నివాసం ఉంటున్నారు.
మనస్తాపానికి గురై, వేదింపులు భరించలేక ఆత్మహత్య
తన భార్య వేరేఒకరితో సంబంధం పెట్టుకోవడమే కాకుండా, ప్రియుణితో చాలా సార్లు కొట్టించిన విషయాన్నీ భరించలేక మనస్తాపానికి గురైన పెద్దోళ్ల శివాజీ మంగళవారం సాయంత్రం మాధవపల్లి గ్రామంలోని తన ఇంటికి వచ్చి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇది తెలిసిన మృతిని బంధువులు మహారాష్ట్ర నుండి అర్థరాత్రి వాహనాలలో మాధవపల్లి కి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన బంధువులు రాత్రి నుండి ఉదయం వరకు ఆందోళన చేశారు. ఒక సమయంలో మృతిని భార్య సంతోషి ని చంపడానికి ప్రయత్నం చేశారు.
దీతో గాంధారి ఎస్ఐ శంకర్ కానిస్టేబుల్ సంతోషి ని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతుని ఇంటివద్ద పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి శిక్షించాలని బంధువులు ఆందోళన చేపట్టారు.
పోలీస్ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతిని సోదరుడు బాలాజీ పిర్యాదు మెరకు భార్య సంతోషి, ఇందల్వాయి ఎస్ఐపై కేసు నమోదు చేసుకొని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు.