నిజామాబాద్, జూన్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏఐటియుసి ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు ఆసుపత్రి కార్మికులు రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 60 ప్రతులను శనివారం దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 60 ప్రకారం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచింది కానీ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఇప్పటికే దేశంలోని కేరళ, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో వేతనాలు పెంచినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆసుపత్రిలలో పనిచేస్తున్న కార్మికులకు, పేషెంట్ కేర్ ,సెక్యూరిటీ సిబ్బందికి వేతనాలు పెంచలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన వారికి వేతనాలు పెంచకపోవడం బాధాకరమన్నారు.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి నామమాత్రంగా పెంచడం సరికాదని ఇప్పటికైనా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నెలకు 18వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో యూనియన్ నాయకులు భాగ్యలక్ష్మి , కవిత, లింగం, వెంకట్, కార్మికులు పాల్గొన్నారు.