నిజామాబాద్, జూన్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో వేతన పెంపు వుండేలా ప్రభుత్వం సవరణ జీవోను విడుదల చేయాలని ప్రగతిశీల కేజీబీవీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) ఉమ్మడి జిల్లా బాధ్యులు ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సి ప్రకటించి కొంత మేరకు ఉపశమనం కలిగించిందని, కానీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు.
రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో కనీస వేతనం అందించాలన్నారు. దానిపై 30 శాతం వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్, వర్కర్స్, ఉపాధ్యాయులకు వేతన పెంపుపై స్పష్టత లేదన్నారు. 2016లో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 14 ప్రకారం కూడా ఇప్పటికీ వేతనాలు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోనే అత్యల్పంగా కేజీబీవీ సిబ్బందికి వివిధ కేటగిరీలుగా నెలకు కేవలం 6వేలు, ఏడున్నర వేలు, 11వేలు మాత్రమే వేతనాలు ఇస్తూ ప్రభుత్వం శ్రమదోపిడీకి పాల్పడుతోందన్నారు. కేజీబీవీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని, కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తుందని ఆరోపించారు.
కేజీబీవీ సిబ్బందికి కనీసం మిగతా ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలనైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే సర్వ శిక్ష అభియాన్ సంబంధిత జీవోను విడుదల చేయాలన్నారు.
ఉన్నత లక్ష్యంతో పేద, దళిత, గిరిజన, వెనుకబడిన బాలికల విద్య కోసం, కేవలం మహిళలచే నడపబడుతున్న కేజీబీవీల పట్ల ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్ చేశారు. వేతన పెంపు అమలు చేయకపోతే ఐ.ఎఫ్.టీ.యూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వున్న 475 కేజీబీవీలను ఆందోళనలకు దించుతామన్నారు.
అదేవిధంగా వివిధ గురుకులాల సొసైటీలు వేతనాల పెంపు జీవోలను వెంటనే విడుదల చేసి, అమలు చేయాలన్నారు. సమావేశంలో ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర నాయకులు ఎం.వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు డి.రాజేశ్వర్ లు పాల్గొన్నారు.