కామారెడ్డి, జూన్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాలను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ప్రాంగణంలో గల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల మంజూరు చేయాలని, ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఏర్పాటు చేయాలని, నూతన విద్యా సంస్థలు వచ్చేవరకు ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు.
మెడికల్ కళాశాల విషయమై ఇప్పటి వరకు కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటే కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే అభివృద్ధి చెందాయని కామారెడ్డి జిల్లాలో గత 7 సంవత్సరాల నుంచి ఒక విద్యా సంస్థ కూడా రాలేదని అన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పటికీ మెడికల్ కళాశాల రాకపోవడం ఇక్కడి నాయకుల చిత్తశుద్ధి కి నిదర్శనం అన్నారు.
ఇంజనీరింగ్ కళాశాల భవనం, జివిఎస్ కళాశాల భవనం, వంద ఎకరాల భూమి నిరుపయోగంగా ఉన్నాయని వెంటనే మెడికల్ కళాశాల కు అనుమతిని కేసీఆర్ పర్యటన లోపే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చెట్కురి స్వామి, ఎన్ఎస్ యూఐ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు సుధీర్, కిరణ్ పాల్గొన్నారు.