కామారెడ్డి, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర శాసన సభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్, ఎస్పి భవన సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సౌలభ్యం కోసం సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలను గుర్తించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. సంక్షేమ పథకాల ఫలాలు నిరుపేదలకు అందాలని కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేశారని తెలిపారు. 60 డిపార్ట్మెంట్లు ఒకే దగ్గర ఉండేందుకు వీలుగా జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టర్ రేట్ల సముదాయాలను పూర్తి చేస్తున్నారని చెప్పారు.
పది జిల్లాలు ఉన్నా వాటిని 33 జిల్లాలుగా విస్తరణ చేశారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టారని చెప్పారు.
ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండేందుకు కలెక్టరేట్ సముదాయాలను ప్రభుత్వం నిర్మించిందని చెప్పారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజుల సురేందర్, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఉమ్మడి జిల్లాల డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, అధికారులు పాల్గొన్నారు.