నిజామాబాద్, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్‌సి కమీటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం సవరణ జీవోను విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) నాయకులు డిమాండ్ చేశారు.
బుధవారం స్థానిక ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ పిఆర్సి కమిషన్ సిఫార్సు మేరకు కనీస వేతనం నెలకు 19 వేల రూపాయలు, దానిపై 30 శాతం వేతనపెంపు అమలు చేయాలని ఐ.ఎఫ్.టీ.యూ డిమాండ్ చేస్తోందన్నారు.
ముఖ్యంగా మున్సిపల్ వర్కర్లు కరోనా విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారన్నారు. వీరు అనేక ఏళ్లుగా శ్రమదోపిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం నెలకు రూపాయలు 19 వేలు ఇవ్వాలని, ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలు పెంచాలని పీ.ఆర్.సీ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిందన్నారు. కానీ, పి.ఆర్.సి కమిటీ సిఫార్సులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు.
పి ఆర్ సి కమిటీ సిఫార్సులను అమలు చేయాలని రేపటి నుండి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
సమావేశంలో యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం. సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, నాయకులు శివకుమార్, తిరుపతి, విఠల్ పాల్గొన్నారు.