కామారెడ్డి, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం , అదనపు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల స్థాయిలో శుక్రవారం అంతర్ శాఖల సమన్వయ సమావేశాలు నిర్వహించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.చంద్రశేఖర్ మాచారెడ్డి, భిక్నూర్, సదాశివనగర్, రామరెడ్డి మండలాల్లో జరిగిన అంతర్ శాఖల సమన్వయ సమావేశాలను ఆకస్మిక తనిఖీ చేశారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే సీజనల్ వ్యాధులు అధికంగా ప్రబలే మూడు, నాలుగు మాసాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, దీనికి గాను మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో అన్ని సంబంధిత శాఖలు కలిసి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.
రెవెన్యూశాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ , పంచాయతీ రాజ్ శాఖ , ఐ.కె.పి. గ్రామీణాభివృద్ధి శాఖ తదితర అన్ని శాఖల అధికారులు సమావేశాల్లో పాల్గొన్నారు .
అంతర్ శాఖల సమన్వయ సమావేశాలు గ్రామ పంచాయతీ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసి శాఖల వారీగా వారు చేపట్టవలసిన చర్యల గురించి చర్చించి సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం పకడ్బందీగా ప్రణాళికలు చేపట్టడానికి తగు ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు.