హైదరాబాద్, జూన్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్తగా ఏర్పడ్డ జిల్లాల నుండి హెచ్.సీ.ఏ.లో ఆరుగురు సభ్యులను హెచ్సిఏ అధ్యక్షుడు అజారుద్దీన్ శనివారం నియమించారు. రాష్ట్రంలో క్రికెట్ క్రీడను మరింత విస్తరించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) చర్యలు చేపట్టింది.
తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్సిఏ సభ్యుల సంఖ్యను సైతం పెంచి, అన్ని జిల్లాల్లో యువ క్రీడాకారులను ప్రోత్సాహించనుంది. ఇందులో భాగంగా పలు కొత్త జిల్లాలకు హెచ్సిఏలో సభ్యత్వం కల్పించారు.
జిల్లా కోటాలో వాల శరత్ చంద్ర, మఠం భిక్షపతి, బుద్దుల శ్రవన్ రెడ్డి, దాదన్నగారి సందీప్ కుమార్, దావ సురేష్, కల్కుంట్ల మల్లికార్జున్ లను హెచ్సిఏ జీఎంలో సభ్యులుగా తీసుకున్నారు. వీరిని పలు జిల్లాల అడ్ హక్ కార్యదర్శులుగా నియమిస్తూ హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. నూతన అడ్ హక్ కార్యదర్శులు, సొసైటీస్ చట్టం ప్రకారం సంబంధిత జిల్లా క్రికెట్ అసోసియేషన్ లను, ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమించనున్నారని హెచ్సిఏ ప్రకటించింది.
తద్వారా మారుమూల ప్రాంతాల యువతకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, నైపుణ్యాలను పెంపొందించనున్నట్లు హెచ్సిఏ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు.