డిచ్‌పల్లి, జూన్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలోని పరిశోధకురాలు మిని యు. కె. కు పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డ్ ప్రదానం చేశారు. అసోషియేట్ ప్రొఫెసర్ డా. పాత నాగరాజు పర్యవేక్షణలో మిని యు. కె. ‘‘అభివ ృద్ధి చెందుతున్న దేశాల్లో వనరుల వ్యాకోచత్వం’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు.
కాగా శనివారం ఉదయం ఆన్ లైన్ (వర్చువల్) ఓపెన్ వైవా నిర్వహించారు. ఎక్సటర్నల్ ఎగ్జామినర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్ డా. బి. సుభాకర్ హాజరై సిద్ధాంత గ్రంథంపై పలు ప్రశ్నలడిగారు. పరిశోధకురాలి సమాధానాలకు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఓపెన్ వైవా కమిటికి సోషల్ సైన్స్ డీన్ ఆచార్య కె. శివశంకర్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ సిద్ధాంత గ్రంథంలోని గణాంకాల అనువర్తనీయతను అభినందించారు. కార్యక్రమంలో విభాగాధిపతి డా. బి. వేంకటేశ్వర్లు, డా. కె. రవీందర్ రెడ్డి, డా. ఏ. పున్నయ్య, డా. స్వప్న, సంపత్, డా. శ్రీనివాస్, డా. దత్తహరి, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ప్రిన్సిపల్ డా. వాసం చంద్రశేఖర్ పరిశోధకురాలు మిని యు. కె., పర్యవేక్షకులు డా. పాత నాగరాజులను అభినందించారు.