నిజామాబాద్, జూన్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైన మోడీ, కేసీఆర్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిజామాబాద్ ధర్నా చౌక్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి (ఇంచార్జి) వనమాల కృష్ణ మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం దుర్మార్గమన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజల రక్తాన్ని పీల్చి సుంకాలు వసూలు చేస్తుందని ఆరోపించారు. అదేవిధంగా పప్పు, నూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను వేలం వేసి అమ్మాలని చూస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భూముల అమ్మకాలకు ప్రయత్నాలు చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.
ప్రజలను దోచుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు నిరసించాలని పిలుపునిచ్చారు.
నిరసన ప్రదర్శనలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, సిపిఐ, సిపిఎం, న్యూడెమోక్రసీ నాయకులు పెద్ధి వెంకట్రాములు, ఎం.నరేందర్, ఎం.ముత్తన్న, కే.గంగాధర్, కే.రాజన్న, రామ్మోహన్ రావు, నూర్జహాన్, ఎం.సుధాకర్, గోవర్ధన్, లత, కల్పన, రఘురాం, విగ్నేష్, ప్రశాంత్, శివకుమార్, సుజాత, రాములు, మల్లేష్, రంజిత్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.