నిజామాబాద్, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఏఐటియుసి మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రదర్శనగా కలెక్టరేట్ ధర్నా చౌక్ చేరుకొని మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సి జీవోలో థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా రిక్రూట్ అయిన కార్మికుల వేతనాల పెంపుపై స్పష్టత లేకపోవడం బాధాకరమన్నారు. కావున ప్రభుత్వం జీవో 60 ను సవరించి ఆసుపత్రులు మెడికల్ కాలేజీలో పని చేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీలి కార్మికుల వేతనాలను 19 వేలు నిర్ణయం చేస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్యశాఖకు బాధ్యుడిగా ఉంటూ కరోనా కష్టకాలంలో, ఆస్పత్రులకు అనారోగ్యంతో వచ్చే పేద ప్రజలకు సేవలు చేసే కార్మికుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ వేతనాలు పెంచక పోవడం, పండగ జాతీయ సెలవులు అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.
నిరసనలో భాగంగా మానవ హారం చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి నర్సింగరావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రంజిత్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘు రామ్ నాయక్, యూనియన్ నాయకులు భాగ్యలక్ష్మి, కవిత, వెంకట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.