నిజాంసాగర్, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూర్ మండలం బొరంచ గ్రామంలో నారాయణఖేడ్ చరిత్రలోనే అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 1 లక్ష 31 వేల ఎకరాలకు సాగు నీటిని అందించే ఉదేశ్యంతో నిర్మిస్తున్న బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు, శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని సశ్యశ్యామలం చేయాలనే సంకల్పంతో, నియోజకవర్గ పరిధి లోని ప్రతీ ఎకరానికి సాగు నీటిని అందించాలనే తపనతో ఎత్తిపోతల పథకం సర్వే పనులు ప్రారంభించుకున్నామని, ఈ పథకం ద్వారా 1 లక్ష 31 వేల ఎకరాలకు నీటిని అందిస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా 19, 19 (ఏ) ప్యాకేజీ ల ద్వారా సుమారు 39 వేల ఎకరాలకు నీటిని అందిస్తామని తెలిపారు.
అనంతరం బొరంచా నల్లపోచమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ శివకుమార్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.