డిచ్‌పల్లి, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీ క్లబ్ సీనియర్ సిటిజన్స్, వాసవీ క్లబ్ వనితా ఇందూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహింపబడిన యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ అంతర్జాతీయ కీర్తి గడిరచిన నిజామాబాద్ యోగా గురువులు సిద్ధిరాములు, రాంచందర్‌లను, వారి శిష్యులను సన్మానించారు.
కార్యక్రమాన్ని జిల్లా కో ఆర్డినేటర్ తాటి వీరేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రపంచదేశాలన్నింటికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మికతలో భారతదేశం ఒజ్జబంతి వంటిదని అన్నారు. తనువు, మనసు, ఆత్మను ఏకం చేసేది యోగా అని ఇది మనిషిలోని మానవత్వాన్ని, పరోపకార గుణాన్ని, సౌశీలాన్ని ఉత్తమ ధర్మ నిరతిని ఏర్పరుస్తుందన్నారు.
కరోనా మహమ్మారి విశ్వమంతా విజృంభిస్తున్న నేపథ్యంలో యోగాసనాల ద్వారానే శ్వాసను పెంపొందించుకుంటున్నారన్నారు. అటువంటి యోగాభ్యాసానికి విశ్వవిద్యాలయ స్థాయిలో అనువైన కోర్సులను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను ఉన్నత విద్యాశాఖకు పంపుతామన్నారు. యోగా దినోత్సవం రోజున వాసవీ క్లబ్ వారు యోగా గురువులను సన్మానించడం ప్రశంసించదగ్గ విషయమన్నారు.
అద్భుతమైన ఆసనాలను ప్రదర్శించిన చిన్నారులను అభినందించారు. ఇతర దేశాలలో ప్రదర్శనలు ఇచ్చే విధంగా లండన్, అమెరికా, జర్మనీ, జపాన్‌లలోని యోగా ప్రతినిధులకు రికమెండ్ చేస్తానన్నారు. ఇక ముందు తాను కూడా సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యమవుతానని హామీ ఇచ్చారు.
వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్స్, టీయూ నాల్గవ తరగతి కూలీలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ రవీందర్, జనరల్ సెక్రటరీ పాత సుదర్శన్, అధ్యక్షులు గాదె సుదర్శన్, యోగా గురువులు సిద్ధిరాములు, రాంచందర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. పబ్బ మురళి వీసీ ఆచార్య డి. రవీందర్‌కి ప్రశంసా పత్రం సమర్పించగా, వాసవీ క్లబ్ వారు ఘనంగా సన్మానించారు.