నిజామాబాద్, జూన్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిరికొండ మండలం తుంపల్లి గ్రామ శివారులో గల దొంగ చెరువు శివారు భూమి గత 50 సంవత్సరాలుగా సాగుచేస్తున్న పేద రైతు కూలీలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం సిగ్గుచేటని వెంటనే ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలని ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం నిజామాబాద్ డిఎఫ్‌ఓ కార్యాలయాన్ని ముట్టడిరచారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 2006లో అటవీ హక్కుల చట్టం అమలు చేయటంలో ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వాలు పేదోడికి ఒకరకంగా, ధనవంతులకు ఒకరకంగా చట్టాన్ని అన్వయించుకోవడం శోచనీయమని అన్నారు. 2006 అడవి హక్కుల చట్టాన్ని అమలు చేయవలసిన ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్ అధికారులు పెద్దపెద్ద ధనవంతులకు వందల, వేల ఎకరాలు దోచి పెట్టి, పేదవారు రెండు పూటలా తినడానికి రెండు ఎకరాలు సాగు చేసుకుంటే ప్లాంటేషన్ పేరుతో గుంజుకొని కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారని అన్నారు.
దొంగ చెరువు ప్రాంతం భూములు గత ఐదు దశాబ్దాలకు పైగా సాగు చేస్తున్న విషయం ప్రభుత్వ అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. చట్టంలో పేర్కొన్న విధంగా గత 70 సంవత్సరాలకు పైగా బిసిలు, ఎస్సీలు ఎవరైనా గ్రామంలో జీవిస్తూ అటవీ భూములు సాగులో ఉంటే వారికి హక్కు పత్రాలు కల్పించాలని చట్టంలో పేర్కొన్న సంగతి అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు.
కొంపల్లి గ్రామం ఏర్పడి వందల సంవత్సరాలు గడిచినా వారికి హక్కు పత్రాలు ఇవ్వడంలో అధికారులకు ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నించారు. తుంపల్లి గ్రామ పేద కూలీలు వారు అడుగుతున్నది గొంతెమ్మ కోరిక కాదు ప్రభుత్వం పోరాటాల ఫలితంగా తీసుకువచ్చిన 2006 చట్టాన్ని మాత్రమే అమలు చేసి తమకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
అందులో భాగంగా వెంటనే ప్లాంటేషన్ పనులు గ్రామంలో గ్రామసభ నిర్వహించి అర్హులైన అందరికీ హక్కు పత్రాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే భూముల వద్ద జరిగే లా అండ్ ఆర్డర్ సమస్యకు ఫారెస్ట్ అధికారులే బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, నాయకులు బాల్‌రెడ్డి, గ్రామ యువకులు రాజేందర్, సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.